ఏపీలో జనసేన (Janasena) పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. గతంలో జరిగిన పొరపాట్లను ఈసారి రిపీట్ కాకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అధికార వైసీపీ దెబ్బకు ఏదో ఒక విధంగా ఆయనకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఏపీ అసెంబ్లీకి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. పవన్ ఈసారి కూడా పొత్తులో భాగంగానే ఎన్నికల బరిలో నిలవనున్నారు.
2014లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు తప్ప పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో అలయెన్స్‌తో ఎన్నికల బరిలో దిగి పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. విశాఖలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థుల చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.
ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న పవన్.. పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. గతంలో ఈ స్థానం నుంచి జనసేన తరఫున ఎం శేషుకుమారి 2019లో పోటీ చేయగా..మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు 14,992 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎన్ వీఎస్ఎస్ వర్మపై విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లోనూ పవన్ మళ్లీ బీజేపీ,టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అయితే, పొత్తులో భాగంగా పవన్ ఇప్పటికే కంటెస్టెడ్ ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ, టీడీపీ కోసం వదులు కోవాల్సి రాగా.. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని టీడీపీ,జనసేన ప్రకటించగానే టీడీపీ అభ్యర్థి వర్మ అనుచరులు నానా రభస చేశారు.చంద్రబాబు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడంతో ఆయన తగ్గారు. తాజాగా జనసేన క్యాండిడేట్ ఎం శేషుకుమారి తన స్థానంలో పవన్ పోటీ చేస్తున్నారని తెలిసి.. పార్టీని వీడేందుకు సిద్ధమైంది. నేడు (బుధవారం) సీఎం జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరనున్నారు. కొంతకాలంగా జనసేనకు దూరంగా ఉంటున్న ఆమె వైసీపీ లో చేరితే కేడర్ కూడా దూరమయ్యే అవకాశం లేకపోలేదు. అయితే, జనసైనికులు మాత్రం పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు.