తెలంగాణ రాజకీయాలు(Telangana politics) రంజుగా మారాయి. మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న అధికార పార్టీ నేతలు దూకుడు పెంచారు. ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేల(BRS MLA’s)ను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కొక్కరితో సెపరేటుగా సమావేశాలు నిర్వహిస్తూ తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు కాంగ్రెస్ (Congress)పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే పార్లమెంట్ ఎన్నికలలోపు వారిని హస్తం పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని తమలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని టాక్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం.
గతంలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ప్రభుత్వం విలీనం చేసుకుంది.గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీస్తే ఇప్పుడు అధికార పార్టీ కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీయాలని అనుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్(Greter Hyderabad) పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంది.
అందుకే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మెజార్టీ పెరుగుతుంది. మొన్నటిఎన్నికల్లో ఆ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 39 సీట్లు రాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో 38కి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ఆది నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అందుకే పీసీసీ చీఫ్ రేవంత్ బీఆర్ఎస్ ఎల్పీపై కన్నేసినట్లు వినికిడి.
అప్పుడు ఎవరూ తమ ప్రభుత్వాన్ని కూల్చలేరని ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఇక బీజేపీకి కేవలం 8 సీట్లు మాత్రమే ఉన్నాయి.వారికి ప్రభుత్వాన్ని కూల్చడం అసంభవం అని రేవంత్ సర్కార్ నిర్దారణకు వచ్చింది. కాగా, కాంగ్రెస్ నిజంగానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే కేసీఆర్ నెక్ట్స్ స్టెట్ ఏమిటనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. వారిమీద అనర్హత వేటు వేయించి మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్తారా? లేదా ఎన్డీయేలో చేరి తమ పార్టీని కాపాడుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.