ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquer scam case)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)కు ఈడీ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్‌కు వచ్చిన ఏడుగురు ఈడీ అధికారుల బృందం (ED Officers Team) కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఆమె ఆడపడుచు అఖిల ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఈ తనిఖీల్లో ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కవితను వారం పాటు విచారించి కీలక విషయాలను ఈడీ అధికారులు రాబట్టారు. అనంతరం ఆమె భర్త అనిల్‌ను కూడా విచారించగా.. కవిత, అనిల్ బ్యాంకు లావాదేవీలను నిషితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలోనే కవిత ఆడపడుచు లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అందుకే వారు హైదరాబాద్ వచ్చి ఆమె ఇంట్లో సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. వీటిని కీలక ఆధారాలుగా భావించి రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించి కవితకు మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడగించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా రౌస్ అవెన్యూ కోర్టు కవితకు విధించిన వారం రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. అందుకే మరోసారి కస్టడీ పొడగింపుపై ఈడీ తరఫు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఇదంతా చూస్తుంటే కవితను ఈడీ అధికారులు ఇప్పట్లో వదిలేలా లేరని స్పష్టం అవుతోంది.