ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వచ్చిందంటే చాలు అభిమానులకు పూనకమే.ప్రపంచకప్ కంటే ఐపీఎల్‌కు మన దేశంలో అంత క్రేజ్ ఉంటుంది. మ్యాచ్ ఏదైనా సంబంధం లేదు. ఇంట్లో టీవీలకు లేదా మొబైల్స్‌కు అతుక్కుపోతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక ముంబై, చెన్నై మ్యాచులంటే కొందరు తెగ ఊగిపోతుంటారు. అలాంటిది శనివారం జరిగిన గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచులో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
నరేంద్రమోడీ స్టేడియం వేదికగా నిన్న సాయంత్రం ప్రారంభమైన గుజరాత్ టైటాన్స్(Gujarath Titans) వర్సెస్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) మ్యాచులో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టీం 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
ఇక ఛేదనకు దిగిన పాండ్యా జట్టు ప్రారంభంలో దూకుడుగా ఆడినా ఆ తర్వాత బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలీయన్ బాట పట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ముంబై 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 6 పరుగుల తేడాతో గుజరాత్ తొలి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అయితే, ఈ మ్యాచ్ అనంతరం గుజరాత్, ముంబై ఫ్యాన్స్ దారుణంగా కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.గుజరాత్ మ్యాచ్ గెలిచాక లోకల్ ఫ్యాన్స్ ముంబై జట్టును, ఫ్యాన్స్ కించపరిచేలా కామెంట్స్ చేసినట్లు కథనాలొచ్చాయి. కాగా,రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ముంబై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. నిన్న జరిగిన మ్యాచులో ‘రోహిత్ పరుగుల వేట కొనసాగించాలి.. ముంబై మ్యాచ్ ఓడిపోవాలి’ అనే స్లోగన్స్ కూడా వినిపించడంతో హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్, గుజరాత్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.