అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) పై భారత్ (Bharath) మరోసారి మండిపడింది. ఉపన్యాసాలు ఇవ్వడం మానుకుని, ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంపై దృష్టి సారించాలని సూచించింది. స్విజ్జర్లాండ్‌లోని జెనీవా(Jeniva)లో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (IPU) 148వ అసెంబ్లీలో భారత ప్రతినిధి బృందం పై వ్యాఖ్యలు చేసింది.
జమ్ము కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రతినిధి జెనీవా అసెంబ్లీలో పలు అంశాలపై ప్రస్తావించగా.. భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పాక్ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు.ఉగ్రవాద చర్యలకు మద్దతిస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తున్న దేశం మానవ హక్కులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, విరుద్ధంగా ఉన్న పాకిస్తాన్.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అనేక దేశాలు భారత్‌ను ఆదర్శంగా చూపిస్తున్న అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కశ్మీర్, లఢక్ ఎల్లప్పుడూ భారత్ లో అంతర్భాగమే అని మరోసారి స్పష్టంచేశారు.
ఆ ప్రాంతాలను ఎవరూ విడదీయలేరని, నిరాధార ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదులకు అగ్రనతే అయిన ఒసామా బిన్ లాడెన్, ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు కూడా పాకిస్తాన్ లోనే కనుగొన్నట్లు గుర్తుచేశారు. ఐరాస భద్రతా మండలి నిషేధించిన అత్యధిక మంది ఉగ్రవాదులు పాక్ లోనే ప్రత్యక్షం అయ్యారని కూడా స్పష్టంచేశారు.