ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam)అరెస్టై ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఈడీ(Enforcement Directorate) కస్టడీ మంగళవారంతో ముగియనుంది. మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోదాల పేరుతో రెయిడ్స్ నిర్వహించి అనంతరం అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా తొలుత 7రోజులు, రెండో సారి 3 రోజుల ఈడీ కస్టీకి న్యాయమూర్తి అంగీకరించారు.
మొత్తంగా 10 రోజుల కస్టడీ నేటితో ముగియనుండగా కవితను మంగళవారం మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఈడీ మాత్రం మరోమారు ఆమెను కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల విచారణలో ఆమె నుంచి ఆశించిన మేర సమాధానాలు రాలేదు. దీంతో ఈ కేసులో కింగ్ పిన్ అయిన సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ఆమెను విచారించాలని ఈడీ భావిస్తోంది.
ఇక కేజ్రీవాల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది.ఈ నేపథ్యంలోనే కవిత, కేజ్రీవాల్‌ను ఒకేసారి విచారించి వివరాలు రాబట్టాలని ఈడీ భావిస్తుండగా.. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి భవేజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తారా? లేదా బెయిల్ ఇస్తారా? లేక జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
చివరిదే జరిగితే కవిత తీహార్ జైలుకు వెళ్లక తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే మండోలి జైల్లో ఉన్న సుకేశ్ పలు లేఖలు విడుదల చేశారు.అందులో కవిత, కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు.చివరకు అదే జరుగుతుందా? లేదా కవిత బయటకు వస్తారా? అనేది తేలాల్సి ఉన్నది.ఒకవేళ కవిత బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు లాయర్ గట్టిగా వాదనలు వినిపిస్తే ఆమెకు మరోసారి కస్టడీ లేదా జ్యుడీషియర్ రిమాండ్ తప్పదని తెలుస్తోంది.