కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న గొడవలు ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరో ఒకరు ఏదో రకంగా చిన్ని విషయాలకే తమ అమూల్యమైన ప్రాణాలను బలిగొంటున్నారు. నేటి సమాజంలోని మనుషులకు చనిపోవడానికి ఉన్నంత ధైర్యం బతకడానికి, సమస్యల పరిష్కారానికి చూపించకపోవడం వల్లే ప్రతిరోజూ ఎక్కడో చోట ఎవరో ఒకరు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి మీద ఆధారపడిన పిల్లలు,వృద్ధులు అనాధలు అవుతున్నారు.
తాజాగా జనగామ(Janagama) జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి బుధవారం వెలుగుచూసింది. భార్యాభర్తలు(Couples Suicide) ఇద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పింటించుకున్నారు. పూర్తి వివరాల్లోకివెళితే..జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన సెల్వరాజ్, భాగ్యలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం తమిళనాడులోని చెన్నై నుంచి వలసొచ్చారు.
జనగామ జిల్లాలో ఉంటూ ఇక్కడే జీవనోపాధి కోసం డైలీ లేబర్ వర్క్ చేస్తుంటారు. అయితే, గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. దీంతో దంపతుల మధ్య తరచూ వాగ్వాదం నెలకొంటుంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం దంపతులు ఇద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
వారి అరుపులతో అలర్ట్ అయిన స్థానికులు వారికి కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైంది. తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.