గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) ఉచ్చు బిగుసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయ్యి ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలో ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు(Praneeth Rao) వెల్లడించిన సమాచారం మేరకు మాజీ మంత్రికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
పక్కా సమాచారం మేరకు ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రశ్నించాలని విచారణ అధికారులు నిర్ణయించారు. దీనికి బలమైన కారణమూ లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు పాలకుర్తిలో వార్ రూమ్ ఏర్పాటు చేసి మాజీ మంత్రికి పోటీగా నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వినీ రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేశాడు.
అంతేకాకుండా యశస్విని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు, వారితో టచ్ లోకి వెళ్లిన వ్యాపార,వాణిజ్య పారిశ్రామిక వేత్తల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయి. ఇలా ఒక్క పాలకుర్తినే కాకుండా సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ ఇలా బీఆర్ఎస్ కీలక నేతలు పోటీ చేసిన చోట ప్రణీత్ రావు వార్ రూమ్స్ ఏర్పాటు చేసి అపోజిట్ క్యాండిడేట్స్ కాల్స్ మొత్తం విన్నాడు.
ఆ కీలక సమాచారాన్ని ఆయా కీలక నేతలకు అందజేశాడు. ఇదంతా ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా పాలకుర్తి వార్ రూమ్ గురించి మాజీ మంత్రిని విచారించాలని దర్యాప్తు బృందం రంగం సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఇక మిగతా నియోజకవర్గాల్లోని కీలక నేతలు సైతం భవిష్యత్‌లో విచారణను ఎదుర్కోవాల్సి రావొచ్చని సమాచారం. కానీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి మాత్రం తనకు ఆ ప్రణీత్ రావు ఎవరో తెలియదని, ఫోన్ ట్యాపింగ్ కేసుకు తనకు సంబంధం లేదని మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చారు.