దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh) బీజేపీ(BJP) పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే బోణీ కొట్టింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అసెంబ్లీ స్థానాలను(5 Mla Seats) ఏకగ్రీవంగా(unanimity) కైవసం చేసుకోనుంది. సీఎం పెమా ఖండూతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ఏకగ్రీవం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల తొలిదశలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో రెండు ఎంపీ స్థానాలకు, అసెంబ్లీకి కూడా ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.
దీనికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియకు గడువు మార్చి 27( బుధవారం)తో ముగిసింది. అయితే, సీఎం పెమా ఖండూ పోటీ చేయనున్న ముక్తో నియోజకవర్గంతో పాటు తాలి, తాలిహా, సగలీ, రోయింగ్ నియోజకవర్గాల్లో కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్స్ దాఖలు చేశారు.
వీరికి ప్రత్యర్థులుగా ఎవరూ నామినేషన్స్ దాఖలు చేయకపోవడంతో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది.ఇక నామినేషన్ల ఉపసంహరణ తేదీ వరకు ఇప్పటివరకు దాఖలు చేసిన మరికొందరు కూడా ఉపసంహరించుకుంటే మరికొన్ని స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 60 స్థానాలు ఉండగా బీజేపీ 60 మంది అభ్యర్థులను ప్రకటించింది.
కాగా, 2016లో పెమాఖండూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరగా..ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆయన సీఎం అయ్యారు.