జవహర్ నగర్ మేయర్(Jawahar nagar Mayor) సహా పలువురు కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు కేసులు(Case File) నమోదు చేసినట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు. మార్చి 27వ తేదీన కార్పొరేషన్ ఎన్నికల కోడ్(Election Code)కు విరుద్ధంగా ఆసరా పింఛన్ల పంపిణీ, చలివేంద్రాల ప్రారంభంపై ఎన్నికల అధికారి ప్రభాకర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో మేయర్ శాంతి(Shanthi), డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్(Reddy shetti srinivas), 4,6,9,21,22 డివిజన్ల కార్పొరేట్లపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా జవహర్ నగర్ కార్పొరేషన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ వశమైన విషయం తెలిసిందే.
జవహర్నగర్ కార్పోరేషన్లో 28 డివిజన్లు ఉండగా.. మొత్తం 27 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండేవారు. ఒక కార్పోరేటర్ చనిపోవడంతో ఆ సీటు ఖాళీగా ఉంది. అయితే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కార్పొరేషన్ పరిధిలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి.
20 మంది కార్పొరేటర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మార్చి 19న మేయర్ కావ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కార్పొరేటర్లు అంతా కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండటంతో అవిశ్వాసం నెగ్గింది. దీంతో కావ్య తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె స్థానంలో కొత్త మేయర్గా శాంతి కోటేశ్ గౌడ్, డిప్యూటీ మేయర్గా రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఎంపికయ్యారు.