బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలంతా గుడ్ బై చెప్పి వెళ్లిపోతుండటంపై బీజేపీ కీలక నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (BJP Medak Mp Candidate Raghu nandan Rao)కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శుక్రవారం ఆయన మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్పందించారు.
బీఆర్ఎస్ పార్టీకి కీలక నాయకులు గుడ్ బై చెప్పడం అనేది ఊహించిన పరిణామమే అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది టైటానిక్ పడవ లాంటిదని, ఎప్పటికైనా అది మునిగిపోక తప్పదన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ నేతలంతా కోట్లాడి టికెట్లు తెచ్చుకోవాల్సి పోయి.. ఇచ్చిన టికెట్లు కూడా వదులుకుని వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారంటే ఆ పార్టీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఓ ఒక్క అభ్యర్థి కూడా గెలవడని తేల్చిచెప్పారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మెదక్‌లో ప్రచారం ప్రారంభించిన రఘునందన్ రావు తన గెలుపుపై ధీమాగా ఉన్నారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ప్రజలు తనకు స్పష్టంగా చెప్పారని.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం.. ఎంపీ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేస్తామని అన్నారని.. ఈ సందర్భంగా ఆయన మరోసారి గుర్తుచేశారు. ప్రజల్లోకి వెళ్లి మోడీ ప్రభుత్వం చేస్తున్న మంచిని, సంక్షేమ పథకాలను వివరించడంలో బీజేపీ కార్యకర్తలు ముందున్నారని వివరించారు.