ఆంధ్రా, తెలంగాణ బోర్డర్లో (Andra-Telangana) మావోయిస్టు పార్టీ (maoists Party) పేరిట కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కన్నాయిగూడెం వద్ద నడిరోడ్డుపై మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ కరపత్రాల్లో ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది.
ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే విధంగా దేశ, విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీల మైనింగ్స్, ప్లాంట్లు, రోడ్లు, డ్యాములు, టైగర్ జోన్లు, అభయారణ్యాలు వంటి భారీ ప్రాజెక్టులను నిలిపి వేయాలని భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ల కమిటీ మావోయిస్టు పార్టీ పేరుతో డిమాండ్ చేశారు.
అడవుల్లో జీవించే ఆదివాసీల స్వయం ప్రతిపత్తికి, చట్టలకు భంగం కలిగించే, ఉద్యమాలను అణిచివేసే కార్పెట్ సెక్యూరిటీ పోలీస్ క్యాంపులను, పారా మిలిటరీ స్పెషల్ బలగాలను ఎత్తివేయాలని, లేనియెడల ప్రతీకార చర్యలు తప్పవని మావోయిస్టులు కరపత్రాల సందేశం ద్వారా హెచ్చరించారు.
ఇదిలాఉండగా, ఈ కరపత్రాలను మావోయిస్టులు నేరుగా అడవుల్లో నుంచి వచ్చి పంచరని, ఎవరో వారి కోసం పనిచేసే వ్యక్తుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు మరిన్న బలగాలను రంగంలోకి దించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా మావోయిస్టుల కదలికలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులకు ఆదేశాలు జారీచేశారు.