వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి (Warangal mp candidate) ఎంపికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కడియం కావ్యా(Kadium kavya) ఎంపీ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో తమ పేరును పరిశీలించాలని లోకల్ లీడర్లు బీఆర్ఎస్(BRS) అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను తప్పించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు.
దీంతో రాజయ్య అధిష్టానంపై కోపంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కడియం , ఆయన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు అక్కడ బలమైన క్యాండిడేట్ ఎవరూ కనిపించడం లేదు.
ఈ క్రమంలోనే మాజీ బీఆర్ఎస్ నేత బాబుమోహన్‌కు కేసీఆర్ కాల్ చేసి రెండు రోజుల్లో ఎంపీ టికెట్ కన్ఫామ్ చేస్తానని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్ లో చేరిన రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు పల్లారాజేశ్వర్ రెడ్డి మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వరంగల్ ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు టాక్.
అయితే, సీనియర్లు ముందుకు రాకపోతే వరంగల్ ఎంపీ స్థానం తమకు కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారులు, మాజీ కార్పొరేటర్లు బోడ డిన్నా, జోరిక రమేశ్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు మొదటి నుంచి కడియం కావ్యకు ఎంపీ సీటు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. మరో వైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్సీ పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సైతం వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. కాగా, గులాబీ బాస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి కేటాయించనున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.