ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case)కేసులో ఇప్పటికే అరెస్టై ప్రత్యేక విచారణ బృందం అధికారుల కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజరంగరావులకు నాంపల్లి కోర్టు(Nampally Court) ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్(Judicial Remand) విధించింది. మంగళవారంతో ఈ ఇద్దరు అధికారుల కస్టడీ ముగియడంతో పోలీసులు మందుగా తిరుపతన్న, భుజంగరావులను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి వారిద్దరికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. మరోసారి కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక విచారణ బృందం తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా కోర్టు మాత్రం రిమాండ్ వైపే మొగ్గు చూపింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ వదలకూడదని ఫిక్స్ అయ్యింది.
ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావుల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అడిషనల్ ఎస్పీలను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపింది.
ఈ ఇద్దరు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్ ట్యాపింగ్ లో సాయం చేసిన, తమతో కలిసి పనిచేసిన అధికారులు, వ్యక్తుల గురించి పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఎస్ఐబీ మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తిరుపతన్న, భుజంగరావు విచారణలో అంగీకరించిన విషయం తెలిసిందే.