రాష్ట్రంలోని అన్నదాతలు(FARMERS) పంటలు సరిగా పండగ అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే వారి నెత్తిన మరో పిడుగు పడినట్లు అయ్యింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు(DROUGHT SITUATION) నెలకొన్నాయి. నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆఖరు తడికి అయినా నీళ్లు అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.గతంలో ఇదే సమయానికి చెరువులు, కుంటల్లో నీరు లభ్యత మెండుగా ఉన్నది.
ఉన్నట్టుండి తెలంగాణలోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో కూడా నీటి లభ్యత తగ్గుతూ వస్తోంది. దీంతో నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో అన్నదాత కంటతడి పెట్టుకుంటున్నాడు. కొత్త ప్రభుత్వం వస్తే తమ కష్టాలు తీరుతాయని భావించిన కర్షకులకు కన్నీరే మిగిలింది. రుణమాఫీ,రైతుబంధు, రైతు భీమా ఏది అందలేదని, సబ్సిడీ కింద విత్తనాలు కూడా ప్రభుత్వం అందించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే వారికి కేంద్రప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.పత్తివిత్తనాల ధరలను(CUTTON SEED PRICE HIKE) స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గతేడాది 475 గ్రామలు ప్యాకెట్ ధర రూ.853 ఉండగా.. ఇప్పుడు రూ.864కు చేరింది. కంపెనీల డిమాండ్లకు అనుగుణంగా కేంద్రం ఏటా విత్తనాల ధరలను పెంచుతూ వస్తోంది.
2020-21లో ప్యాకెట్ ధర రూ.730గా ఉండేది. ఇప్పుడు రూ.864కు చేరింది. ఇక తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి అని అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో నీటి లభ్యత దృష్ట్యా రైతులు ఎక్కవగా పత్తిని సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పత్తి విత్తనాల ధరల పెరుగుదల అన్నదాతలకు మరికొంత భారం కానుంది.