పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో దేశంలోని రాజకీయ పార్టీలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రచార హోరును పెంచింది. స్వయంగా ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక ఇండియా కూటమి మాత్రం ఇంకా అంతర్గత కుమ్ములాటలతో కాలయాపన చేస్తున్నది.
లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో(Andra pradesh) నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొంది. అసెంబ్లీ, లోక్ సభకు మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఏ పార్టీకి అత్యధిక స్థానాలు రాబోతున్నాయనే విషయంపై రైజ్ (RISE) (ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్) సంస్థ ఒక సర్వే(SURVAY)ను నిర్వహించింది. ఏపీలోని వివిధ జిల్లాలు, గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజల నుంచి అభిప్రాయాన్ని మార్చి 31 తేదీ వరకు సేకరించినట్లు తెలిపింది.
ఇప్పటికే ఏపీలో పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయ్యింది. అభ్యర్థులు, పార్టీల బలబలాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికే అత్యధిక స్థానాలు రాబోతున్నట్లు రైజ్ సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లట స్పష్టంచేశారు.
తమ సంస్థ సర్వే ప్రకారం ఏపీలో 25 పార్లమెంట్ స్థానాల్లో 17-19 సీట్లను కూటమికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక అధికార వైసీపీకి 7-9 నుంచి స్థానాలు రావొచ్చని.. 1-3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ పట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో కూటమి అభ్యర్థులు, అరకు, రాజమండ్రి, నరసాపురం, కర్నూలు, కడప స్థానాలు వైసీపీ ఖాతాలో చేరతాయని రైజ్ సంస్థ వెల్లడించింది.