బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి.ఆ పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ ఇబ్బంది పెడుతోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్(Nomula Bagath)కు పోలీసులు షాక్ ఇచ్చారు. నందికొండ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నివాసం(Ex Mla Home) ఉండే ఈఈ 19 నంబర్ గల ఎన్నెస్పీ ఇంటిని రెవెన్యూ, పోలీస్, ఎన్నెస్పీ అధికారులు సంయుక్తంగా కలిసి మంగళవారం రాత్రి సీజ్ చేశారు.
అందులోని విలువైన సామగ్రిని మున్సిపల్ సిబ్బంది సాయంతో ఎన్నెస్పీ స్టోర్ రూమ్‌లకు తరలించారు.దీనిపై ఎన్నెస్పీ అధికారులను వివరణ కోరగా.. ఎన్నెస్పీకి చెందిన ఈఈ 19 నివాస గృహాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరిట అటాచ్ మెంట్ చేశారని, ఎమ్మెల్యే మారడంతో ఆ క్యాంపు ఆఫీసును ఖాళీ చేయాల్సి ఉండగా..నోముల భగత్ ఖాళీ చేయలేదన్నారు.
పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కలెక్టర్ ఆదేశానుసారం సీజ్ చేయాల్సి వచ్చిందన్నారు. పోలీసుల తన ఇంటిని సీజ్ చేశారని తెలియడంతో భగత్ హైదరాబాద్ నుంచి బయలు దేరారు. హాలియా మీదుగా నాగార్జున సాగర్ వెళ్తుండగా అలీనగర్ వద్ద పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో నోముల భగత్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కావాలనే తన ఇంటిని సీజ్ చేశారని, తనకు ఎన్నెస్పీ నుంచి ఎటువంటి సమాచారం లేదన్నారు. తన ఇంట్లోని విలువైన సామగ్రిని తీసుకుంటానని చెప్పినా అధికారులు వినడం లేదని వాపోయారు. ఈ ఘటనపై తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఎన్నెస్పీ క్వార్టర్స్‌లో నివాసం ఉండేందుకు జానారెడ్డికి ఎంత హక్కు ఉందో తనకు అంతే ఉందన్నారు.