రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు(Ex Dcp RadaKishan Rao) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరికొంత మంది అధికారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆయన విచారణలో చెప్పిన వివరాల మేరకు పలువురు అధికారులను సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. అయితే, విచారణకు మరికొంత సమయం కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం కోరడంతో న్యాయమూర్తి మరో 7 రోజుల పాటు రాధాకిషన్ రావును కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపనున్నారు.
ఇప్పటికే ఎస్ఐబీలో పనిచేసిన మరో కీలక అధికారి ఓఎస్డీ వేణుగోపాల్ రావుకు పోలీసులు విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. రాధాకిషన్ రావు వాంగ్మూలం మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఆయన్ను రెండు రోజుల నుంచి రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు అధికారులు అరెస్టు అవ్వగా.. వేణుగోపాల్ రావును కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టాస్క్‌ఫోర్స్‌లోని మరో ముగ్గురు పోలీసులను సైతం దర్యాప్తు బృందం విచారిస్తున్నది. గురువారం రాధా కిషన్ రావును కస్టడీలోకి తీసుకుని తొలిరోజు విచారించనుంది.
ఎలక్షన్ సమయంలో డబ్బులు ఏ నియోజకవర్గానికి తరలించారు? ఎవరికి అందజేశారు? అనే వివరాలను రాబట్టనున్నట్లు సమాచారం. రాధా కిషన్ రావు కస్టడీలో ఉన్న టైంలోనే మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది.