Telugu News » Reactor Blast : మంటల్లో ప్రాణాలు.. ఘోర విషాదం

Reactor Blast : మంటల్లో ప్రాణాలు.. ఘోర విషాదం

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు.

by admin
Reactor Blast At SB Organics LTD At Chandapur

– సంగారెడ్డిలో ఘోర విషాదం
– కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్
– నలుగురి మృతి.. 15 మందికి గాయాలు
– మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్
– సీఎం రేవంత్ సహా ప్రముఖుల విచారం

ఎండాకాలం వస్తే అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఎండ వేడికి ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రమాదం జరిగిందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో అగ్నిప్రమాదం జరిగింది. హత్నూర మండలంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చందాపూర్‌ శివారులోని ఎస్బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి.

Reactor Blast At SB Organics LTD At Chandapur

ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌తో పాటు బిహార్‌కు చెందిన కార్మికులు దుర్మరణం చెందారు. మరో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలిని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పరిశీలించారు.

సీఎం దిగ్భ్రాంతి

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

కేసీఆర్ సంతాపం

సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పేలుడు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం ప్రకటించారు. మరిణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు కేసీఆర్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కూడా విచారం వ్యక్తం చేశారు.

ఎక్స్ గ్రేషియా ప్రకటన

పేలుడు ఘటన‌పై మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ఘటనా స్థలాన్ని సందర్శించి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హాస్పటల్‌ కు తరలించామని, క్షతగాత్రులు కోలుకునేంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆయిల్ వల్లే..!

జిల్లా కలెక్టర్ క్రాంతి స్పందిస్తూ, రియాక్టర్ పేలి అగ్నిప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందారని, 15 మంది తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న ఆయన, రియాక్టర్ లో ఆయిల్ ఎక్కువ కావడంతో పేలుడు జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో కంపెనీ డైరెక్టర్ రవి శర్మ మృతి చెందాడని తెలిపారు.

You may also like

Leave a Comment