తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Central minister anurag Takur) స్పందించారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(TG Minister Srider babu) బీజేపీ నేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు.
ఒకవేళ టెలిగ్రాఫ్ చట్టాన్ని(Teligraff Act) ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేసి ఉంటే కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ స్పష్టంచేశారు. ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే కంపల్సరీ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ఈసారి రెండంకెల సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు 7 శాతం నుంచి 14 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రం పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, గిరిజన యూనివర్సిటీకి గత ప్రభుత్వం భూమి ఇవ్వడంలో ఆలస్యం చేసిందని చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని తమ నేతలు అనలేదన్నారు.
బీజేపీకి 8 సీట్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం కావాలంటే 61 సీట్లు కావాలన్నారు. తాము ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలం. బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు చేసినట్లు తప్పుగా ఆపాదిస్తున్నారని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు.