ఫోన్ ట్యాపింగ్ కేసులో ( Phone Tapping) ప్రధాన నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు(EX Dgp Radakishan rao) లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో ఓ ప్లాట్ సెటిల్మెంట్ కేసులో భాగంగా రాధాకిషన్ రావు సుదర్శన్ (sudarshan)అనే వ్యక్తిని బెదిరించి రూములో బంధించినట్లు తెలిసింది.ఈ కేసులో రాధాకిషన్ రావును ఏ1గా చేరుస్తూ కూకట్ పల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు.
బాధితుడు సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకుని బాధితుడు పీఎస్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
గతంలో రాధాకిషన్ రావు ఎవ్వరినీ లెక్కచేయకుండా పలువురిని బెదిరించి తనకు కావాల్సిన పనులు చేయించుకున్నాడని తెలుస్తోంది. ‘నేను చెప్పినట్టు వినాలి. లేదంటే నీ భాగస్వాములు చంపేస్తారు.. నేను వినకపోతే కరోనా అంటించి చంపేస్తా.. ఈ రాష్ట్రంలో నేనే బాస్.. ఏ పోలీసుకు చెప్పుకుంటావో చెప్పుకో.. అంటూ రాధాకిషన్ రావు బాధితుడు సుదర్శన్‌ను బెదిరించినట్లు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది.
సుదర్శన్, అతని భాగస్వాములు ఏవీకే రాజు, మరో వ్యక్తికి మధ్య డబ్బుల విషయంలో గొడవ కాగా, అప్పుడు రాధాకిషన్ రావు మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఆ గొడవను సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.అందుకోసం సుదర్శన్‌ను రాధాకిషన్ రావు బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నాడు.అయితే, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావును.. కస్టడీ ముగియగానే కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేస్తారని తెలుస్తోంది.