తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్ఎస్(BRS) సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు దానికి అనుబంధంగా నిర్మించిన బ్యారేజీలు ప్రస్తుతం నిరూపయోగంగా మారినట్లు తెలుస్తోంది. అందుకు మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలోని పిల్లర్లు కుంగడమే కారణమని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యాక్ బోన్ వంటిందని, మేడిగడ్డను రిపేర్ చేయకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక ‘వైట్ ఎలిఫెంట్’గా మారక తప్పదని అంటున్నారు నీటి పారుదలశాఖ నిపుణులు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సుమారు ఐదేళ్లు పూర్తికావొస్తుంది. దశాబ్దాల కిందట అప్పటి ప్రభుత్వాలు నిర్మించిన పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తుంటే బీఆర్ఎస్ సర్కారు సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం అప్పడే ఎందుకు డ్యామేజ్ అయ్యిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు వివర్శిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, లక్షన్నర కోట్ల ప్రజా సొమ్మును బీఆర్ఎస్ నేతలు దోచుకుతిన్నారని, నాసిరకం పనుల వల్లే మేడిగడ్డ బ్యారేజీకి డ్యామేజీ ఏర్పడిందని కాంగ్రెస్ పెద్దలు విమర్శిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్ల కుంగుబాటుపై కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఓ కమిటీ వేసింది. ఎన్డీఎస్ఏ అధికారుల బృందం ఇప్పటికే పలుమార్లు బ్యారేజీని పరిశీలించి నివేదిక తయారు చేసినట్లు సమాచారం.
అది ప్రభుత్వానికి చేరగానే బ్యారేజీకి రిపేర్లు సాధ్యమా? కాదా? తదుపరి కర్తవ్యం ఏమిటనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజ్కి మరింత డ్యామేజీ ఏర్పడినట్లు తెలుస్తోంది. బ్యారేజీలోని 20 పిల్లర్ 5 ఫీట్ల మేర కుంగినట్లు సమాచారం.దీనికి తోడు పిల్లర్లకు భారీగా పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. 7వ బ్లాక్ పై ఉన్న 11 పిల్లర్లు సైతం కుంగుబాటుకు గురైనట్లు సమాచారం. గత నెల నుండి ఇప్పటివరకు 7వ బ్లాక్ లోని పిల్లర్లు 2 ఫీట్లకు పైగా కుంగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలాఉండగా బ్యారేజీకి మరమ్మత్తులు చేసినా తట్టుకోవడం అసాధ్యం అని సీనియర్ అధికారులు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.కాగా, ఎన్డీఎస్ఏ నివేదిక రాగానే మేడిగడ్డ భవితవ్యం తేలిపోనుంది.