ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి చుక్కెదురైన విషయం తెలిసిందే. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్
ముగియగా.. ఆమెను ఈడీ అధికారులు మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవితకు మరోసారి 14 రోజుల పాటు జ్యుడీషియల రిమాండ్ విధించింది.
అనంతరం కవిత (Mlc kavita) ను అధికారులు తిహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే కవిత జైలు నుంచి జస్టిస్ కావేరి భవేజా(Judge Kaveri bhaveja)కు లేఖ రాశారు.ప్రస్తుతం ఈ లేఖలోని అంశాలు బయటకు లీక్ అవ్వగా సంచలనంగా మారాయి.
కవిత లేఖలో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు..
– మహిళా రాజకీయ నాయకురాలిగా ఈ మొత్తం దర్యాప్తులో నేను బాధితురాలిని. నా వ్యక్తిగత, రాజకీయ జీవితానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది.
-లిక్కర్ స్కాం కేసును రెండున్నరేళ్లుగా సాగదీస్తున్నారు. దేశం మొత్తం చూస్తున్నది. ఈడీ, సీబీఐ దర్యాప్తు అంతులేని కథగానే మిగిలింది. చివరకు మీడియా ట్రయల్(విచారణ)గా మారిపోయింది.
-చివరకు నా మొబైల్ నంబర్ కూడా టీవీల్లో ప్రత్యక్షమైంది. నా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లింది.
-ఈడీ, సీబీఐ అధికారులకు నేనే విచారణలో పూర్తిగా సహకరించాను. నాకు తెలిసినవి అన్నీ చెప్పాను. నా బ్యాంకు లావాదేవీలు, వ్యాపార వివరాలు కూడా ఇచ్చాను. కానీ, నేను ఫోన్లు ధ్వంసం చేశానని, ఆధారాలను మాయం చేశానని పదేపదే నన్ను నిందిస్తున్నారు.
– రెండు దర్యాప్తు సంస్థల(ఈడీ,సీబీఐ) అధికారులు నా ఇంట్లో రెయిడ్స్ చేశారు. నన్ను పలుమార్లు ప్రశ్నించారు.శారీరకంగా, మానసికంగా నన్ను వేధించారు. ఒత్తిడి తెచ్చారు. బెదిరించి చివరకు అరెస్టు చేశారు.
-కేవలం స్టేట్మెంట్ల మీద ఆధారపడి కేసు విచారణ జరుగుతోంది.జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కేసు విచారణ సందర్భంగా మనీ ట్రయల్ లేదు. అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవు.. ఇది నిలిచే కేసు కాదన్నారు.
– కేసులో నా పాత్ర ఉంటే మా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నన్ను ఎందుకు అరెస్టు చేయలేదు? ఇప్పుడు అధికారం కోల్పోయాక ఎందుకు అరెస్టు చేశారు?
-ఈడీ,సీబీఐ కేసుల్లో దాదాపు 95శాతం దేశంలోని ప్రతిపక్ష పార్టీ నేతలపైనే ఉన్నాయి. బీజేపీలో చేరిన వారిపైన నమోదైన కేసులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి.
– పార్లమెంట్ వేదికగా పలువురు బీజేపీ లీడర్లు ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. సైలెంట్‌గా ఉండండి.. లేదంటే ఈడీని పంపిస్తాం.. అని కామెంట్ చేస్తున్నారు.
– అందుకే ప్రతిపక్ష నాయకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. న్యాయం దొరకుతుందని నమ్ముతున్నారు.
– నాకు ఈ కేసుతో సంబంధం లేదు. అయినా, విచారణకు సహకరిస్తున్నాను. జైలులో శిక్ష అనుభవిస్తున్నను. నా కుమారుడికి పరీక్షలు ఉన్నాయి.
అతని చదువును దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వండి. ఒక తల్లిగా నాకు నా జీవితంలో ఇది ఒక బాధ్యత.
-ఉన్నత విద్యావంతురాలిగా నా కొడుక్కి బోర్డు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ పరీక్ష సమయంలో తోడుగా ఉండటం అవసరం. నేను లేకపోతే మా అబ్బాయి మానసిక ప్రవర్తనలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నది.