బ్రిటీషర్స్ దుర్మార్గాలకు ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు అసువులు బాశారు. కన్న తల్లిలా భావించే సొంత నేలను విడిచి ఉండలేక.. తెల్లదొరల కాళ్ల కింద బానిసత్వం భరించలేక వారికి ఎదురుతిరిగి ఉరికొయ్యలను ముద్దాడారు. బ్రిటీషర్స్ అకృత్యాలను కూకటివేళ్లతో పెలికించడానికి జరిగిన పోరాటంలో తుదిశ్వాస విడిచిన స్వాతంత్య్ర సమరయోధుల్లో షహీద్ రాయ్ అహ్మద్ ఖాన్ ఖరాల్ ఒకరు. అతని తలను శిరచ్ఛేదం చేసిన బ్రిటీషర్స్..దానిని జైలులో ప్రదర్శనకు ఉంచిన ఘటన ఉద్యమకారుల నెత్తుటిని మరిగేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. ఖరాల్ మరణం తర్వాత కూడా తిరుగుబాటు చాలా కాలం కొనసాగేలా చేసింది.
షహీద్ రాయ్ అహ్మద్ ఖాన్ ఖరాల్ (Shaheed Ahmad khan Karal).. పంజాబ్‌లోని శాండల్ బార్ ప్రాంతంలోని ఖరల్ తెగకు చెందిన భూస్వామి కుటుంబంలో ఝమ్రాలో జన్మించాడు. ఖరాల్స్ బార్ గిరిజన సమూహాలైన కథియా, వాటూ, ఫటాయానా, ఇతరులతో బ్రిటీషర్స్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. అంతకుముందు లియోపోల్డ్ ఆలివర్ ఫిట్‌జార్డింగే బర్కిలీ లేదా లార్డ్ బెర్క్లీ 1857లో గోగేరా అసిస్టెంట్ కమిషనర్. అతను షహీద్ ఖరాల్‌తో సహా గోగేరాలోని ముఖ్యవ్యక్తులతో సమావేశాన్ని నిర్వహించాడు.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కొనసాగుతున్న తిరుగుబాటును అణిచివేసేందుకు మనుషులు, గుర్రాలను సరఫరా చేయాలని బెర్క్లీ షహీద్ రాయ్ ఖరాల్‌ను కోరగా.. అందుకు అతను తిరస్కరించాడు. ఖరాల్స్ స్త్రీలు,గుర్రాలు, భూమిని తాము ఎవరితోనూ పంచుకోము అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే, పన్నులు చెల్లించడం లేదనే కారణంతో జులై 8న బ్రిటీష్ వారు పెద్ద సంఖ్యలో జోయా గిరిజనులు, మహిళలు, పిల్లలను అరెస్టు చేశారు. ఈ వార్త తెలుసుకును్న షహీద్ ఖరాల్ గోగేరా జైలులోకి చొరబడి అందులో ఉన్న అమాయక ప్రజలను రక్షించాలనుకున్నాడు. అతని మిత్రులైన ఫటాయానా, వాటూ, కతియా తెగల సాయంతో జులై 26న గోగేరా జైలుపై దాడి చేశాడు.
ఈ ప్రయత్నంలో 145 మంది ఖైదీలు మరణిచంగా..వందకు పైగా బ్రిటీష్ దళాలు కూడా మరణించాయి. ఆ తర్వాత కొంతకాలానికి బ్రిటీష్ అధికారులు షహీద్ ఖరాల్‌ను అరెస్టు చేయించారు. అయితే, స్థానిక తెగల నుండి ఒత్తిడి తీవ్రం అవ్వడం, అతనిపై అభియోగాలు మోపేందుకు తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఖరార్ ను బ్రిటీషర్స్ విడుదల చేశారు.
జైలు నుంచి విడుదలయ్యాక ఖరాల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. షహీద్ ఖరాల్‌ను అరెస్టు చేయడానికి మరొక ప్రయత్నం జరగడంతో పాటు ఝమ్రాపై దాడి జరిగింది. అది విఫలం కావడంతో ఖరాల్ చిన్న కుమారుడు బాలా ఖాన్ ఖరాల్‌తో సహా 20 మంది పౌరులను బ్రిటీష్ సైనికులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసాక షహీద్ ఖరాల్.. కథియా, వట్టూ, ఫటాయానా,జోయా గిరిజనుల సాయంతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని కొనసాగించారు.
ఓరోజు గిరిజన నాయకులతో కలిసి ఖరాల్ రహస్య సమావేశం నిర్వహించి గోగేరాపై దాడికి ప్లాన్ చేశాడు. అయితే, కమలియాకు చెందిన సర్ఫరాజ్ ఖరాల్ అనే వ్యక్తి ఈ సమాచారాన్ని బ్రిటీష్ అధికారులకు అందజేశాడు. దాంతో షహీద్ ఖరాల్ ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటును బ్రిటీషర్స్ అడ్డుకోగలిగారు. అనంతరం షహీద్ ఖరాల్ తన సహచరులతో గష్కోరి అడవులకు పారిపోయి కొంతకాలం దాక్కుని తిరిగి పోరాటాన్ని కొనసాగించాడు.
ఖరాల్‌ను అరెస్టు చేసేందుకు బ్రిటీష్ వారు గష్కోరి అడవుల్లో సోదాలు జరిపించారు. కెప్టెన్ బ్లాక్ ఆధ్వర్యంలో ఒక దళాన్ని అక్కడికి పంపగా.. అదే టైంలో షహీద్ ఖరాల్ తన సన్నిహిత సహచరులతో కలిసి మధ్యాహ్నం ప్రార్థనలు చేస్తుండగా.. అతన్ని బ్రిటీష్ దళాలు అతన్ని చంపేశాయి.
ఈ ఘటన తర్వాత ఖరాల్ యొక్క నమ్మకమైన స్నేహితుడు మురాద్ ఫటాయానా తన మిత్రుని హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు. మురాద్ ఫటాయానా దాడిలో బ్రిటిష్ సైనికులతో పాటు లార్డ్ బెర్క్లీని మరణించాడు. అనంతరం బ్రిటీష్ ఈఐసీ బలగాలు, స్థానిక తెగలకు జరిగిన యుద్దంలో తెగలు పూర్తిగా అంతరించాయి. దీంతో 1858లో తిరుగుబాటు పూర్తయ్యింది. కాగా, షహీద్ ఖరాల్ మరణాంతరం అతని తలను శిరచ్ఛేదం చేసి గోగేరా జైలులో బ్రిటీష్ అధికారులు ప్రదర్శనకు ఉంచారు. కొన్ని రోజుల తర్వాత అతని మద్దతుదారుల్లో ఒకరు ఆ తలను దొంగిలించి ఝమ్రాలోని అతని పూర్వీకుల స్మశానవాటికలో ఖననం చేశారు. కాగా, షహీద్ ఖరాల్ తిరుగుబాటును చరిత్ర విస్మరించడం చర్చనీయాంశంగా మారింది.