ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం తిహార్ జైలు(TIHAR JAIL)లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితకు (MLC KAVITHA) సీబీఐ(CBI) కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఆమెకు ఈనెల 23వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించింది.
ఇటీవల కోర్టు కవితకు 3 రోజుల పాటు సీబీఐ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఆ గడువు కాస్త ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను నేడు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు( సీబీఐ స్పెషల్ బెంచ్) ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం సీబీఐ తరఫు లాయర్ వాదిస్తూ 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని, శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై ప్రశ్నించగా సమాధానం చెప్పలేదన్నారు. లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు.
ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత జవాబులు ఇచ్చిందని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై ప్రశ్నిస్తే సూటిగా సమాధానాలు ఇవ్వకుండా టైం వేస్ట్ చేసిందన్నారు. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి అని.. అందుకే ఆమెకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. దీంతో ఇరుపక్షాల తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.
దీంతో కవితను సీబీఐ అధికారులు తిహార్ జైలుకు తరలించారు. అంతకుముందు తిహార్ జైలులోనే సీబీఐ అధికారులు కవితను అరెస్టు చేసి.. ఈడీ నుంచి కేసును వారు టేకాఫ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జరిగిన అవినీతి తేల్చేపనిలో ప్రస్తుతం వారు నిమగ్నమయ్యారు. ఇదిలాఉండగా లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు అయ్యి నేటితో సరిగ్గా నెల రోజులు అయ్యింది. గత నెల మార్చి 15న ఈడీ ఆమెకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇక పోతే తాజాగా మరోసారి సీబీఐ కస్టడీకి ఇస్తు కోర్టు తీర్పు చెప్పగా.. దీనిపై కవిత స్పందించారు. జైలుకు తరలిస్తున్న టైంలో ఆమె మీడియాతో ఇలా అన్నారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలనే.. జైలులో సీబీఐ అధికారులు అడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు.
రెండేళ్లుగా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారని.. అందులో కొత్తదనం ఏమీ లేదని చెప్పారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారుల మీద కవిత సీరియస్ అయ్యారు. అయితే, కవిత మీడియాతో మాట్లాడిన విషయం తెలిసి జడ్జి కావేరి భవేజా ఆమె మీద సీరియస్ అయ్యారు.సంతకాల కోసం కవిత లాయర్ మొహిత్ రావు జడ్జి వద్దకు వెళ్లగా ఆమె మందలించినట్లు సమాచారం. ఇంకోసారి కవిత ఇలా చేస్తే బాగోదని హెచ్చరించినట్లు తెలిసింది.