భారతదేశం చేసిన ప్రతిపాదనకు ఇరాన్ (IRAN)ఎట్టకేలకు ఓకే చెప్పింది. ఇజ్రాయెల్(ISRAEL)కు చెందిన ఓ భారీ కార్గో నౌకను ఇటీవల ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అందులో 17 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగశాఖకు సమాచారం అందింది. దీంతో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జై శంకర్ ఆదివారం ఇరాన్ దేశ అధికార ప్రతినిధులతో ఫోన్ ద్వారా సంభాషించారు.
చర్చలు సఫలం కావడంతో కార్గో షిప్లో చిక్కుకున్న 17 మంది(17 INDIAN CREW) భారతీయులను కలిసేందుకు ఇండియన్ అధికారులకు అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఓడ వివరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే భారత ప్రభుత్వ ప్రతినిధులు ఆ నౌకలో ఉన్న సిబ్బందితో సమావేశం కావొచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్ అబ్దుల్లాహియాన్ తెలిపారు.
ఇక గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు యూఎన్ఓ భద్రతా మండలితో సహా అంతర్జాతీయ సంస్థల ద్వారా భారత్ తమ పాత్రను కొనసాగించాలని ఇరాన్ పేర్కొంది. ఇదిలాఉండగా, ఈనెల 13వ తేదీన ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో షిప్ భారతదేశానికి వస్తుండగా ఇరాన్ ఆర్మీ దానిని స్వాధీనం చేసుకుంది.
అందులో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారిని విడిపించేందుకు భారత విదేశాంగశాఖ నడుం బిగించింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ఎస్ జై శంకర్ ఇరాన్ అధికారులతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలను తగ్గించుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని సూచించినట్లు చెప్పగా.. దీనిపై ఇరాన్ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.