పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్(Congress) పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు(Political Advisor sunil kanugolu) నిర్వహించిన సర్వేలో మల్కాజిగిరి (Malkajgiri) నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం నోవాటెల్ హోటల్ వేదికగా ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా సునీల్ కనుగోలు ఏఐసీసీ పెద్దలకు అందించిన రిపోర్టులో ఏముందని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలంగాణలోని ఏయే ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉందో అనే విషయాన్ని సునీల్ కనుగోలు రిపోర్టు రూపంలో ఐఏసీసీ పెద్దలకు అందజేసినట్లు తెలుస్తోంది.
ఈ రిపోర్టు ఆధారంగా రాష్ట్రనేతలకు కేసీ వేణుగోపాల్ హితబోధ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మల్కాజిగిరి, సికింద్రాబాద్ , చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ స్థానాల్లో బీజేపీ బలమైన క్యాండిడేట్స్ పోటీలో ఉండగా.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని టాక్.
ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు.ఇక కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి ఎంపీగా ఉండగా.. ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే మద్దతు కరువైందని తెలుస్తోంది.బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మల్కాజిగిరి టికెట్ ఇవ్వడం ఏంటని సొంత కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరగాలంటే రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం నిర్వహించాలని కేడర్ భావిస్తోంది. ఈటలకు మద్దతుగా ఇప్పటికే మోడీ ఒకసారి మల్కాజిగిరి పర్యటించారు. మరోసారి ప్రధాని త్వరలోనే హైదరాబాద్ కు రానున్నారు. ఈలోపు రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పర్యటించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్ సైతం రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం.కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలంటే తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలని వేణుగోపాల్ కీలక నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
పట్నం సునీతా రెడ్డి గెలుపుకోసం మనస్పర్దలు పక్కనబెట్టి లోకల్ కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు సహాయం చేయాలని ఏఐసీసీ పెద్దలు సూచించారు.స్థానిక నేతలను కలుపుకుని ఇంటింటికీ ప్రచారం చేయాలని, ప్రతి ఓటరును ప్రసన్నం చేసుకోవాలని రాష్ట్రనాయకత్వానికి కేసీ వేణుగోపాల్ స్ఫష్టం చేసినట్లు తెలిసింది.