పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్బంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(cpi)కు బిగ్ షాక్ తగిలింది. కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Koonamneni Samba Shivarao)పై కేసు నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ముందస్తు అనుమతులు లేకుండా మీటింగ్ నిర్వహించారని బీఎస్పీ నేత ఎర్ర కామేశ్ ఎన్నికల సంఘానికి కూనంనేనిపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు అధికారులకు అందజేశారు.
పాల్వంచ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ఆదేశాలతో ఆయనపై పోలీసులు కూనంనేనిపై 188, 171-సీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం సీపీఐ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే, పొత్తులో భాగంగా సీపీఐ పార్టీ తమకు రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కోరగా..అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో సీటు దక్కని కారణంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని అయిన సీపీఐకు కేటాయించాలని కూనంనేని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో త్వరలో భేటీ కావాలని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.