ఆంధ్రప్రదేశ్ లో ఒక ఏనుగు బీభత్సం (Elephant Attack) సృష్టించింది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సుపై దాడి చేసి బస్సును పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం (Parvathipuram) జిల్లా కొమరాడ (Komarada) మండలం అర్థాం గ్రామంలో జరిగింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో గుంపు నుంచి తప్పిపోయిన మగ ఏనుగు బీభత్సం సృష్టించింది. రాయగడ నుంచి పార్వతీపురం వెళుతున్న విజయదుర్గా ట్రావెల్స్ బస్సుపై ఏనుగు దాడి చేసింది.
అర్థాం గ్రామ రహదారిపై వస్తున్నబస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు బస్సును బలంగా ఢీ కొట్టింది. దాంతో దాని అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత మరో సారి ఢీ కొట్టడంతో లోపలున్న ప్రయాణీకుల సామాగ్రి, బస్సు లోపలి భాగాలు చెల్లాచెదురుగా పడి పోయాయి. ఏనుగు దాడితో ప్రయాణీకులంతా బెంబేలెత్తిపోయారు.
బస్సుపై దాడి చేసిన ఏనుగు ఆ తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులను సైతం కాసేపు వెంబడించి హడలెత్తించింది. కొమరాడ మండలంలోని గుంపు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆరు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపేందుకు అటవీ శాఖ గతంలో ఇద్దరు ట్రాకర్లను ఏర్పాటు చేశారు. కానీ ఏనుగులు మాత్రం ఇక్కడే సంచరిస్తున్నాయి.
కొమరాడ మండలోం హరి అనే మగ ఏనుగు ఒంటరిగా తిరుగుతూ చుట్టు పక్కల ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో కూడా చాలా సార్లు గుంపు నుంచి విడిపోయి అంతరాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఆస్తినష్టానికి కారణమైనట్లు స్థానికులు చెబుతున్నారు.