లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్(BRS) పార్టీ ప్రస్తుతం ఈ దుస్థితికి రావడానికి గల పరిస్థితులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukender reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి ఆ జిల్లాల్లోని మంత్రులే కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారంతా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.ఇటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ తాజా పరిస్థితిని సమీక్షించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీలు అంతర్గత సమస్యలు(Internal Issues) ఉన్నాయని కుండబద్దలు గొట్టారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమన్నారు. ఒకప్పుడు జేబులో రూ.500 కూడా లేని వ్యక్తులు ఇవాళ రూ.కోట్లు సంపాదించారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉద్యమకారుల ముసుగులో దోపిడీకి పాల్పడ్డారని, నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలు తనను కేసీఆర్ తో కలవకుండా చేశారన్నారు.
16 సార్లు రిక్వెస్ట్ చేస్తే తనను మంత్రి మండలలోకి తీసుకుంటానని చెప్పాకే.. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లు మండలి చైర్మన్ గుత్తా హాట్ కామెంట్స్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.