పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదివరకు విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నాలుగో విడతలో భాగంగా ఏపీ అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి.ఇటీవల నామినేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్(Nomination) దాఖలు చేశారు.అనంతరం కడపలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో షర్మిలా పాల్గొని మాట్లాడారు. ‘అధికారంలోకి వచ్చాక కొందరు పెద్దలుగా ఎదిగిపోయారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకా న్యాయం ఎలా దొరుకుతుంది. నేను ఎన్నికల్లో పోటీ చేసేది న్యాయం కోసమే. ప్రజలు న్యాయం వైపా? నేరం వైపా? అనేది ఆలోచించుకోవాలి.
5 ఏళ్లలో అవినాష్ రెడ్డి దోషి అని CBI చెప్పింది. అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు ఒకదగ్గరే ఉన్నారని గూగుల్ మ్యాప్స్ సాక్ష్యం ఉంది. మొన్న అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి గూగుల్ మ్యాప్స్ 100 మీటర్ల వరకు తేడా ఉంటుంది అని అంటున్నాడు. నిజంగానే తేడా ఉంటే అన్ని సాక్ష్యాలు మీ ఇంటి వైపు ఎందుకు చూపిస్తున్నాయి? అందుకు అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి.
మీకు మీకు లావాదేవీలు ఉన్నాయి అని CBI స్పష్టంచేసింది. హత్య జరిగినప్పుడు ఇవన్నీ మాకు తెలియదు. CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము చెప్తున్నాం. CBI సాక్ష్యాధారాలు చూపిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? నిందితులను ఎందుకు కాపాడుతున్నారు? అని వైఎస్ షర్మిలా ప్రశ్నించారు.కాగా, ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ అటు వైసీపీ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి.