పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ (Nomination) దాఖలు చేసే సమయంలో అఫిడవిట్లో వెల్లడిస్తున్న వ్యక్తిగత ఆస్తులు,అప్పులు, క్రిమినల్ కేసుల విషయంలో నమ్మశక్యం కానీ విషయాలు వెలుగుచూస్తున్నాయి. సాధారణంగా ఈ మధ్యకాలంలో పొలిటికల్ లీడర్లు సమాజసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతున్నారు.
కానీ, ఒక్కసారి అధికారంలోకి వచ్చాక వారి ఆస్తులు ముందు ఉన్నవాటికంటే డబుల్, ట్రిపుల్ అవుతున్నాయి. కొందరు తమ ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో తప్పుగా పొందుపరుస్తున్నారు. ఫలితంగా ఎన్నికల్లో పోటీకి అర్హతను కోల్పోతున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) ఎంపీ అభ్యర్థి (MP Candidate)గా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లోని ఆస్తుల వివరాలు తాజాగా బయటకు రివీల్ అయ్యాయి. కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.228.47కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఈ ఆస్తిలో బ్యాంకు డిపాజిట్లు, పలు సంస్థల్లో షేర్లు సైతం ఉన్నాయి.కాగా, ఆయనకు సొంత వాహనం లేదని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. కానీ, ఆయన భార్య పేరిట 4 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. కాసాని కుటుంబానికి రూ.15.12 కోట్ల చరాస్తులుగా ఉండగా.. స్థిరాస్థులు రూ.213.35 కోట్లు ఉన్నాయి. రూ.30లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు. ఇదిలాఉండగా, కాసాని గతంలో టీడీపీ తెలంగాణ చీఫ్గా కొనసాగగా.. ఆ తర్వాత కేసీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.