షాహీద్ కుశాల్ కొన్వార్.. భారతదేశాన్ని పాలిస్తున్న క్రమంలో చేయని నేరానికి అతనికి బ్రిటీషర్స్ ఉరిశిక్ష విధించారు. చాలా కాలం పాటు జైలులో శిక్ష అనుభవించాడు. కుశాల్ జైలులో ఉన్న టైంలో అతని భార్య సందర్శనకు వచ్చినపుడు క్రూరులైన బ్రిటీష్ సైనికుల మరణానికి దేవుడు తనను ఎంచుకున్నాడని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఎవరికీ లభించదని.. ప్రాణత్యాగం చేసేందుకు గర్వపడుతున్నానని తన భార్యతో చెప్పినట్లు తెలిసింది. ఆయన మరణం తర్వాత కూడా స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.
షాహీద్ కుశాల్ కొన్వార్ అస్సాం(Assam)లోని గోలాఘట్ జిల్లా ఘిలాధారి మౌజాకు చెందిన చౌడాంగ్ చరియాలీలో జన్మించాడు. ఆయన రాజకుటుంబానికి చెందిన వాడు. దీంతో అందరూ ‘కొన్వార్’ అని పిలిచేవారు. కొంతకాలానికి ఆయన బిరుదు కూడా మాయమైంది. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం నడుస్తున్న టైంలో బెంగమై అనే ప్రాంతంలో కుశాల్ (Shaheed kushal konwar) ఓ ప్రాథమిక పాఠశాలను స్థాపించి గౌరవ ఉపాధ్యాయుడిగా సేవలందించారు.
క
ఆ తర్వాత బలిజన్ టీ ఎస్టేట్లో గుమాస్తాగా చేరి అక్కడ కొంతకాలం పనిచేశాడు. 1925లో కుశాల్ శాకాహారిగా మారి శ్రీమద్ భగవద్గీతను ఎక్కువగా పఠించేవాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం కావడంతో ఉప్పు తీసుకోవడం కూడా మానేశాడు. దీనిని తన జీవితంలో చివరి క్షణం వరకు పాటించాడు. 1942 ఆగస్టు 18న బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ‘క్విట్ ఇండియా’(Quit India) తీర్మానాన్ని ఆమోదించింది.
దీని ప్రధాన ఉద్దేశం భారత్ నుంచి బ్రిటిష్ వారిని పూర్తిగా వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’(DO OR DIE) అనే యుద్ధ నినాదం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. దీంతో రెచ్చిపోయిన బ్రిటిష్ అధికారులు సామూహిక అరెస్టులకు పాల్పడ్డారు. అది కాస్త ప్రజల్లో ఆగ్రహజ్వాలలను రేకెత్తించాయి. ఫలితంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విస్తృత ప్రజా ఉద్యమానికి దారితీసింది. కులమతాలకు అతీతంగా ప్రజలు ‘వందేమాతరం’ నినాదం చేస్తూ వీధుల్లోకి వచ్చారు.
అహింసతో కూడిన నిరసన({Protest)కు పిలుపునిచ్చినప్పటికీ చాలా ప్రాంతాల్లో హింస చెలరేగింది.ప్రజలు బ్రిటీష్ అధికారుల కార్యాలయాలను తగలబెట్టడం,ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, రహదారి, టెలికమ్యూనికేషన్కు అంతరాయం కలిగించారు. 10 అక్టోబరు 1942 తెల్లవారు జామున స్వాతంత్ర్య ఉద్యమకారులు దట్టమైన పొగమంచులో దాగి గోలాఘాట్ జిల్లాలోని సరుపత్తర్ సమీపంలోని రైల్వే లైన్ నుండి ట్రైయిన్ పట్టీలను తొలగించారు. దీంతో మిలిటరీ రైలు పట్టాలు తప్పి వెయ్యి మందికి పైగా బ్రిటీషర్స్ మిత్రరాజ్యాల సైనికులు చనిపోయారు.
అది తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. జోర్హాట్ జిల్లా మేజిస్ట్రేట్, సీఏ హంఫ్రీ, సమీప ప్రాంతంలోని కార్యకర్తలకు అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. రైలు ప్రమాద ఘటనలో అమాయకుడైన కుషాల్ కొన్వార్ను పోలీసులు పట్టుకున్నారు. ఆయనపై రైలు విధ్వంసానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు అభియోగాలు మోపారు. దీంతో అతన్ని గోలాఘాట్ నుంచి తీసుకొచ్చి 5 నవంబర్ 1942న జోర్హాట్ జైలులో ఉంచారు.
అతనికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేకపోయినా దోషిగా ప్రకటించబడటంతో పాటు ఉరిశిక్ష విధించబడింది. తన తప్పు లేదని తెలిసినా కుశాల్ ఆ తీర్పును గౌరవంగా స్వీకరించారు. జోర్హాట్ జైలులో ఉన్న అతని భార్య ప్రభావతి తనను సందర్శించినప్పుడు దేశం కోసం అత్యున్నత త్యాగం చేయడానికి వేలాది మంది ఖైదీలలో దేవుడు తనను మాత్రమే ఎన్నుకున్నందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. షహీద్ కుశాల్ తన మిగిలిన రోజులను జోర్హాట్ జైలు మరణశిక్ష గదిలో ప్రార్థనలు చేస్తూ, గీతా పఠనంలో గడిపాడు.
కాగా, 15 జూన్ 1943 తెల్లవారు జామున 4:30 గంటలకు జోర్హాట్ జైలులో కుశాల్ కొన్వర్ను ఉరితీశారు. సైనికుల చావుతో అతనికి ఎటువంటి సంబంధం లేకపోయినా మాతృభూమి కోసం గౌరవంగా ఉరిశిక్షను అంగీకరించాడు. ఆ తర్వాత ఉరికంభం ఎక్కాడు. కానీ, ఆయన త్యాగాన్ని ఎవరూ గుర్తు చేసుకోకపోవడం గమనార్హం.