గత బీఆర్ఎస్(BRS) సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్(Congress) సర్కార్ న్యాయవిచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నేటి నుంచి(బుధవారం) కాళేశ్వరం ప్రాజెక్టులోని నిర్మాణ లోపాలు, మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage)లో పియర్స్ కుంగుబాటుపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్(Retired Judge pinaki ChandraGhosh)ఆధ్వర్యంలోని బృందం విచారణ జరపనుంది.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ బుధవారం మధ్యాహ్నం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.27వ తేదీ వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టనున్నారు. అందుకోసం అవసరమైన సాంకేతిక, న్యాయపరమైన సిబ్బందిని ఆయన నియమించుకోనున్నారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించింది. గత బీఆర్ఎస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట లక్షల కోట్లు దోచుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనూ పలు మార్లు ఆరోపించారు.
తమ సర్కార్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ సర్కార్ అవినీతిని ప్రజల ముందు బట్టబయలు చేస్తానని ప్రకటించారు.ఆ విధంగానే రాష్ట్రంలో అధికార బదిలీ జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేసి తెలంగాణ ప్రజానీకానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, నిర్మాణంలో జరిగిన అవినీతిని ఎక్స్పోజ్ చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం ఫెయిల్యూర్‌పై ఇరిగేషన్ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్ల విషయంపై నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది.