రాష్ట్రంలో మరొక ఎలక్షన్కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి జోరుగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంథలోనే మరో ఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం నగారా మోగించింది.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. దీని ప్రకారం మే 2వ తేదీన నోటిఫికేషన్, మే 2 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, 27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.
అయితే, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందడంతో ఆయన తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.
ఓటర్ నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా.. 2021 మార్చి 14న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగగా.. ఆ టైంలో మొత్తం 76 మంది బరిలో నిలిచారు. ఆనాడు ఇండిపెండెంట్గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చిన విషయం తెలిసిందే.