పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress party) పార్టీ ప్రచారంలో స్పీడును పెంచింది. ఈ క్రమంలోనే భువనగిరి(Bhongir)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం చామల కిరణ్(Mp candite chamala kiran) విజయాన్ని కాంక్షిస్తూ చండూరులో ఏర్పాటు చేసి రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పంద్రాగస్టు లోపు రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని భరోసా కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన ఆరుగ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని మునుగోడు ఎమ్మెల్యే తెలిపారు.
అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే హామీలు అమలు చేయడం లేదని కేసీఆర్ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నే బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సిరిసిల్లకు ధీటుగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ నిచ్చారు. చండూరులో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేస్తామన్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కులం, మతం పేరుతో ఓట్లు అడిగేవారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, కారు పార్టీకి ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్లే అని రాజగోపాల్ రెడ్డి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.కేసీఆర్ పదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి కాలి చిప్పను కాంగ్రెస్ పార్టీకి అందజేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యాక కూడా కేసీఆర్ సిగ్గు లేకుండా ఎలా ఓట్లు అడుగడానికి వచ్చారంటూ రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.