ఏఐఎంఐఎం(Aimim) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి(Indi Alliance) లో చేరని పార్టీలన్నింటితో కలిసి థర్డ్ ఫ్రంట్(Third front) ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ను తాను కోరానని చెప్పారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత ఉందన్నారు.
ఆ రాజకీయ శూన్యతను ఇండియా కూటమి పూరించ లేకపోయిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తే ఆ రాజకీయ శూన్యత భర్తీ అవుతుందని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వం వహిస్తే థర్డ్ ఫ్రంట్ లోకి చేరేందుకు పలు పార్టీలు, పలువురు నేతలు సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇండియా కూటమిలో చేరాలని తనను ఆహ్వానించక పోవడంపై ఆయన స్పందించారు. ఆ విషయం గురించి తాను పెద్దగా పట్టించుకోబోనన్నారు. బీఎస్పీ చీఫ్ మాయావతి, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రలోని పలు పార్టీల నేతలు ఇండియా కూటమిలో చేరలేదని ఆయన గుర్తు చేశారు.
గతంలో కూడా థర్డ్ ఫ్రంట్ కు సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఏఐఎంఐఎం నేత వారిస్ పథాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలోని కొన్ని సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు తమను అంటరాని వాళ్లుగా చూస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.