అరెస్టులతో చంద్రబాబుపై (Chandrababu) జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) విజయం సాధించారని అనుకుంటే పొరపాటని బీజేపీ గోషామమల్ ఎమ్మేల్యే రాజా సింగ్ అన్నారు. కానీ బంతిని కిందకి ఎంత బలంగా కొడితే అంత పైకి లేచినట్టే…ఏపీ (Andhra Pradesh) లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు. ఆదివారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన రజాకార్ సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి రాజాసింగ్ అతిథిగా వ్యవహరించారు.
చంద్రబాబుపై పెట్టిన కేసులు ఫేక్ అని కోర్టు కొట్టి వేస్తుందని తెలిపారు. ఈ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతుందని, చంద్రబాబుకి ప్లస్ అవుతుందని తెలిపారు. ముందు నుంచీ చంద్రబాబు గొప్ప లీడర్ గా ప్రజల్లో మంచి పేరుందనీ వచ్చే ఎన్నికల్లో ఆయననే విజయం సాధిస్తారనీ ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ఏం చేశారూ, ఏం చేస్తున్నారో రెండు రాష్ట్రాల ప్రజలూ గమనిస్తున్నారనీ రాబోయే ఎన్నికల్లో ప్రజలే జగన్ కు సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబును జైలుకు తీసుకెళ్లిన విధానం కూడా ఏం బాగోలేదని చెప్పారు. జైలు కెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారన్నారు.
బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా చంద్రబాబు అరెస్టు పై స్పందిస్తున్నారు. వీరిలో ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించగా తాజాగా ఈ జాబితాలోకి రాజాసింగ్ చేరారు. అయితే వీరంతా తెలంగాణా బీజేపీకి చెందిన నాయకులే కావడం గమనార్హం.