చంద్రబాబు అరెస్టును నిరసిస్తు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ (Raj Ghat) గాంధీజీ సమాధి వద్ద టీడీపీ ఎంపీలు (TDP MPs) నివాళులు అర్పించారు. అనంతరం నారా లోకేశ్ (Nara Lokesh) సహా ఆ పార్టీ ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి అక్కడే కూర్చుని మౌనదీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కూడా పాల్గొన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పొల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ… న్యాయస్థానంలో ఈ రోజు చంద్రబాబు పిటిషన్లు విచారణకు వస్తున్నాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. ఎలాంటి అవినీతి చేయని చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద తాము నివాళి అర్పించే పరిస్థితిని సీఎం జగన్ తీసుకొచ్ఛారని మండిపడ్డారు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో అవినీతి జరిగిందని దానికి ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలతో ఏపీ సీఐడీ చంద్రబాబుని అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టటం ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ గా తరలించటం జరిగింది. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిసనలు వ్యక్తంచేస్తున్నారు. విదేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టుకు నిసననగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.