మంగళగిరి పార్టీ కార్యలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం (TDLP Meeting) ముగిసింది. తొలిసారి చంద్రబాబు గైర్హాజరీలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. అచ్చెన్నాయుడు అధ్యక్షతన శాసనసభపక్ష సమావేశం జరిగింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ (Nara Lokesh) జూమ్ నుంచి టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు జరగనున్నాయి.
శాసనసభకు వెళ్లి చంద్రబాబు అరెస్ట్ అక్రమమని తమ గళం విప్పాలని పార్టీ నేతలు నిర్ణయించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలపడం కోసమైనా వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి చర్చకు పట్టు పట్టాలని, సభకు వెళ్లి అక్కడే ప్రభుత్వాన్ని నిలదీయడం సరైన ఆలోచన అని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసెంబ్లీకి వస్తే టీడీపీ నేతలకు 70 ఎంఎం సినిమా చూపిస్తామని మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్లపై ఈ సమావేశంలో టీడీపీ నేతలు చర్చించారు. కొందరు మంత్రులు అయితే మరీ ఓవరుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సమావేశం ముగిసిన తర్వాత టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంశంపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికను వదులుకోకూడదని నిర్ణయించుకున్నాం, సభలో చేయాల్సిన పోరాటం సభలో…వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేస్తామని చెప్పారు. సభలో మైక్ ఇవ్వకపోవడం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి అందోళనలు చేస్తామని తెలిపారు. వైసీపీకి స్క్రీన్ ప్రెజెంటేషన్ అవకాశమిస్తే, తాము కూడా జగన్ అక్రమాస్తుల కేసులపై స్క్రీన్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలని పట్టుబడతామన్నారు.
ఒకవేళ సభ లోపల అవకాశం ఇవ్వకుంటే.. జగన్ అవినీతి కేసుల అంశాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అలాగే ఇంకా టీడీపీ నేతల తదుపరి అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నాయన్న అంశం పైనా టీడీఎల్పీలో చర్చ జరిగిందని తెలిపారు.