మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) పై బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు (Nama Nageshwar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ (Parliament) లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రవేశ పెట్టారని ఆయన అన్నారు.
గతంలో దేవగౌడ ప్రభుత్వ హయాంలో 13వ లోక్ సభలో, వాజ్ పాయ్ ప్రధానిగా వున్న సమయంలో 15వ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైందని వెల్లడించారు. తాజాగా ఐదవ సారి లోక్ సభలో ఈ బిల్లును ప్రశే పెట్టారని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన 12 రోజుల్లోనే అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తీర్మానం చేసినట్టు గుర్తు చేశారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను తమ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు తెలంగాణ సర్కార్ రిజర్వేషన్ కల్పించిందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇది తమ పార్టీ విధాన నిర్ణయమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనే ఆ బిల్లును అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే దానికి ఓ డెడ్ లైన్ అయినా విధించాలని కోరారు. నియోజకవర్గాల పునర్ విభజనతో పాటు రిజర్వేషన్ అమలు విషయంలో డెడ్లైన్ ఉండాలన్నారు.