మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(Arjun Ram Meghwal) లోక్ సభలో మాట్లాడారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా దేశంలో అధికారికంగా తీర్మానాన్ని ఆమోదించిన మొదటి రాజకీయ పార్టీ బీజేపీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోందన్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా మహిళా రిజర్వేషన్ కోసం తమ పార్టీ డిమాండ్ చేసిందన్నారు. కానీ అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఈ బిల్లును తీసుకు రాలేక పోయందన్నారు. 18 మే 2014న కాంగ్రెస్ టర్మ్ ముగిసిందన్నారు. మోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో సామాజిక-ఆర్థిక సంక్షేమ పథకాలు, మహిళల ప్రగతికి బలం చేకూరిందన్నారు.
26 జనవరి 1950న మనం రాజకీయ సమానత్వం పొందుతామని 25 నవంబర్ 1949న బీఆర్ అంబేడ్కర్ చెప్పారన్నారు. మిగిలిపోయిన సామాజిక సమస్యలను రాబోయే ప్రభుత్వాలు సరిదిద్దాలని సూచించారన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారని మేఘ్వాల్ చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళల గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఈ బిల్లుతో మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ బిల్లు వల్ల చట్ట సభలో మహిళ ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. ఈ బిల్లులో ముఖ్యమైన నాలుగు క్లాజులు ఉన్నాయని వివరించారు. గతంలోనూ మహిళా బిల్లును తీసుకువచ్చేందుకు పాలకులు ప్రయత్నం చేశారని చెప్పారు. ఆ బిల్లు 2010లో రాజ్యసభలో పాసైనా, లోక్సభలో మాత్రం పెండింగ్లో ఉందన్నారు.