Telugu News » Nipah: బెంగాల్ లో నిపా వైరస్‌ కలకలం!

Nipah: బెంగాల్ లో నిపా వైరస్‌ కలకలం!

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సదరు వ్యక్తి తొలుత కేరళలోని ఎర్నాకులం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు.

by Sai
bengal-man-hospitalised-with-nipah-symptoms-after-returning-from-kerala

కేరళ (Kerala) ను భయపెడుతోన్న నిపా వైరస్(Nipah) తాజాగా పశ్చిమ బెంగాల్‌(Bengal)కు పాకినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిపా వైరస్‌ను పోలిన లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరడమే దీనికి కారణం. ఇటీవల కేరళ నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి నిపా వైరస్ లక్షణాలతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. కేరళలో వలస కూలీలుగా పనిచేస్తున్న బుర్ద్వాన్ జిల్లాకు చెందిన వ్యక్తి తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లుగా ఆయన వెల్లడించారు.

bengal-man-hospitalised-with-nipah-symptoms-after-returning-from-kerala

20 ఏళ్ల వయసున్న ఆ యువకుడికి అవసరమైన పరీక్షలు చేయాల్సి వుందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సదరు వ్యక్తి తొలుత కేరళలోని ఎర్నాకులం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే బెంగాల్‌కు తిరిగి వచ్చాడని.. అయితే రెండ్రోజుల్లోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యాడని సదరు అధికారి తెలిపారు. ఆ యువకుడిని తొలుత నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి, ఆపై బెలియాఘట ఐడీ హాస్పిటల్‌కు తరలించారు. ఇకపోతే.. కేరళలో నిపా వైరస్ సంక్రమణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌పై పోరాడేందుకు కేరళ ప్రభుత్వం ఓపీడీ సేవను ప్రారంభించింది. ఇ-సంజీవని టెలిమెడిసిన్ సిస్టమ్ పేరిట ప్రత్యేక ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవను ప్రారంభించింది.

ఈ సందర్భంగా కోజికోడ్ జిల్లా కలెక్టర్ (DC) ఎ.గీత మాట్లాడుతూ… నిపా సంబంధిత భయాందోళనలను దూరం చేయడంలో ఈ సేవ దోహదపడుతుందని తెలిపారు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఉన్న వ్యక్తులు డాక్టర్‌ని సందర్శించకుండానే ఆన్‌లైన్‌లో వైద్య సహాయం పొందవచ్చు. ఈ-సంజీవని నిపా OPD సేవ ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇ-సంజీవని ప్లాట్‌ఫారమ్ ద్వారా, మీరు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చికిత్స పొందవచ్చని తెలిపారు.

You may also like

Leave a Comment