Telugu News » NEET: నీట్ విద్యార్థులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌!

NEET: నీట్ విద్యార్థులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌!

నీట్ పీజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేవారి నుంచి 'జీరో కటాఫ్' వర్తించనుంది.

by Sai
neet pg seat

నీట్ పీజీ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది నీట్ పీజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను ‘సున్నా’కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీలకు ఈ ‘జీరో’ కటాఫ్ వర్తించనుంది. సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది. మూడో రౌండ్‌లో మొత్తం 13 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

neet pg seat

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో నీట్‌ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లయింది. ఇందుకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సెప్టెంబరు 20న ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 800 మార్కులకుగాను జనరల్ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు 291గా, ఎస్సీ-ఎస్టీ-బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు 257గా, దివ్యాంగులకు 274గా ఉండేది. తాజా నిర్ణయంతో అన్ని కేటగిరీలకు కటాఫ్ మార్కులు ‘సున్నా’గా మారాయి.

నీట్ పీజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేవారి నుంచి ‘జీరో కటాఫ్’ వర్తించనుంది. మూడో రౌండ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. నీట్ పీజీ పరీక్షకు హాజరై అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు కూడా కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

You may also like

Leave a Comment