మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఓం కారేశ్వర్ (Omkareshwar)లో 108 అడుగుల ఆది శంకరాచార్యుల (Adhishankara Charya) లోహపు విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj singh Chouhan) ఆవిష్కరించారు. ప్రముఖ జ్యోతిర్లింగం ఓం కారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున దీన్ని నిర్మించారు. మాందా కొండపై ఈ లోహపు విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు.
ఇది ఒక గొప్ప చారిత్రక సందర్భమని ఆయన అన్నారు. ఆదిశంకరాచార్యులు కేరళలో జన్మించారన్నారు. వేదాల సారన్ని సామాన్యులకు అందజేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. దేశం నలుమూలల ఆయన నాలుగు ఆశ్రమాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సందర్బంగా ఈ భారీ విగ్రహం వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక భారత్ లోనే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఐక్యతా విగ్రహం. దీన్ని గుజరాత్ లో 597 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. నర్మదా నది తీరంలో కెవడియా ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2013లో ఈ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహం తయారీకి మొత్తం దాదాపు రూ. 2,389 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఆ తర్వాత భారత్ లో రెండో అతి పెద్ద విగ్రహం సమతా మూర్తి విగ్రహం. దీన్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ లో నిర్మించారు. సమతా మూర్తి విగ్రహాన్ని 216 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ విగ్రహాన్ని గతేడాది ఫిబ్రవరి 5న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దీన్ని పంచలోహాలతో నిర్మించారు.
ఆ తర్వాత స్థానంలో అంబేడ్కర్ విగ్రహం నిలిచింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 11.80 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ విగ్రహం దేశంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహంగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ ను ఉపయోగించారు. ఇక నాల్గవ స్థానంలో రాజస్థాన్లోని శివుడి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ బిలీఫ్) ఉంది.
రాజస్థాన్ లోని నాథ్ద్వారా వద్ద ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 369 అడుగులు. ఆ తర్వాత స్థానాల్లో ఏపీలోని వంశధార నది సమీపంలో నిర్మించిన హనుమాన్ విగ్రహం, కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్లో 161 అడుగులు, తమిళనాడులోని ముతుమలై మురుగన్ విగ్రహం 146 అడుగులు, యూపీలోని వేష్ణో దేవి విగ్రహం 141 అడుగులు, ఏపీలోని పరిటాలలో 135 అడుగులు, తమిళనాడులోని తిరువల్లూర్ విగ్రహం 135 అడుగులు వున్నాయి.