సనాతన ధర్మంపై డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మరోసారి స్పందించారు. ఉదయనిధి స్టాలిన్ పేరు చెప్పకుండా చిన్నపిల్లవాడిని టార్గెట్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. దేశ వ్యాప్తంగా వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ గతంలో అది అతని వ్యక్తిగత అభిప్రాయమంటూ మాట్లాడారు. తాజాగా మరోసారి ఒక చిన్నపిల్లవాడిని టార్గెట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేసారు.
సనాతన ధర్మంపై మంత్రి చేసిన వ్యాఖ్యల్లో కొత్తేమీ లేదని ద్రవిడ ఉద్యమానికి చెందిన ఉదయనిధి తాత, దివంగత డీఎంకే నేత ఎం కరుణానిధి వంటి వారు కూడా గతంలో సనాతన ధర్మంపై మాట్లాడారని కమల్ చెప్పారు. సంఘ సంస్కర్త పెరియార్ వి రామసామికి ఎంత కోపం ఉందో ఆ నాయకుడి జీవితం నుండి అర్ధం చేసుకోవచ్చునని కమల్ హాసన్ అన్నారు. అలాంటి నాయకుడి వల్లనే సనాతన అనే పదం తనలాంటి వారికి అర్ధం అయ్యిందని చెప్పారు.
పెరియార్ వంటి నాయకుడు ఆలయ నిర్వాహకుడిగా ఉన్నప్పటికీ, కాశీలో పూజలు చేసినప్పటికీ వాటన్నింటినీ విడిచిపెట్టి తన జీవితం మొత్తం ప్రజా సేవకే అంకితం చేసారని కమల్ మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికల గురించి మాట్లాడిన కమల్ బీజేపీ మరల అధికారంలోకి రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోందని అభిప్రాయపడ్డారు.