మహారాష్ట్ర(Maharashtra) లోని నాగ్‌పూర్(Nagapur) నగరం వరదనీటితో జలమయం అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నాగ్‌పూర్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు ప్రారంభించారు. నాగ్‌పూర్‌లో వరదలు ముంచెత్తడంతో కేంద్ర బలగాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
నాగ్‌పూర్ విమానాశ్రయంలో శనివారం ఉదయం 5.30 గంటల వరకు 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు రహదారులు, నివాస ప్రాంతాలు జలమయమైనట్లు అధికారులు తెలిపారు. నాగ్‌పూర్‌కు చెందిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణవీస్ నగరంలోని వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘‘ఎడతెగని వర్షపాతం కారణంగా అంబజారి సరస్సు పొంగిపొర్లుతోంది. దీంతో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
నగరంలోని ఇతర ప్రాంతాలు కూడా నీట మునిగాయి’’ అని ఎక్స్ లో ఫడణవీస్ కార్యాలయం తెలిపింది. కొన్ని చోట్ల చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు పలు బృందాలను రంగంలోకి దించామని నాగ్‌పూర్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, పోలీసు కమిషనర్‌లను డిప్యూటీ సీఎం ఆదేశించినట్లు ఫడణవీస్ కార్యాలయం తెలిపింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను కూడా రంగంలోకి దింపుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక అధికార యంత్రాంగం నగరంలోని పలు వరద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలు ముఖ్యమైన పనుల కోసం తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. నాగ్‌పూర్, భండారా, గోండియా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిశాయని వాతావరణశాఖ తెలిపింది. వార్ధా,చంద్రపూర్, భండారా, గోండియా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి, యవత్మాల్, గడ్చిరోలి మీదుగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.