ఏపీ రాజకీయమంతా ఇప్పుడు కేసులు, అరెస్టుల చుట్టూనే తిరుగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case) లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్ కాగా, ఇప్పుడు నారా లోకేష్ (Nara Lokesh) ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డ కేసులో ఏ14గా చేరుస్తూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టు (ACB Court) లో మెమో దాఖలు చేసింది. గత కొంతకాలంగా త్వరలో లోకేష్ అరెస్ట్ అంటూ సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చకు ఇది ఊతం ఇచ్చినట్లైయ్యింది.
ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉండటంతో లోకేష్ ఢిల్లీ స్థాయిలో చంద్రబాబును బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు విడుదల కోసం ఒక వైపు న్యాయపరంగా మరో వైపు పొలిటికల్ గా కూడా టీడీపీ ఫైట్ చేస్తుంది. అయితే తాజాగా లోకేష్ పేరును ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా చేర్చడం సంచలనంగా మారింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే…
“యువగళం పేరు వింటే సైకో జగన్ గజగజలాడుతున్నాడు. నా పాదయాత్ర ఆరంభం కాకూడదని జీవో 1 తెచ్చినా, ఆగని యువగళం జనగళమై గర్జించింది. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగింది. మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి, నా శాఖకి సంబంధం లేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో నన్ను ఏ14గా చేర్పించారు ఈ 420 సీఎం. రిపేర్ల పేరుతో రాజమహేంద్రవరం బ్రిడ్జిని కూడా మూసేయించారు. నువ్వెన్ని తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసినా నా యువగళం ఆగదు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జనచైతన్యమే యువగళాన్ని వినిపిస్తుంది, ఇచ్ఛాపురం వరకూ నడిపిస్తుంది.” అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన మాట్లాడారు.
లోకేష్ అరెస్ట్ ఖాయమంటూ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న తరుణంలో సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయడంతో టీడీపీ పార్టీ నుంచి మరో అరెస్ట్ తప్పదని పొలిటికల్ సర్కిల్స్ లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.