ఇండో- పసిఫిక్ (Indo pacific) ప్రాంతంలో సంక్లిష్టతను ఎదుర్కొనేందుకు సమిష్టి కృషి అవసరమని రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. వసుదైక కుటుంబం (ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం) అనే ప్రాచీన భారతీయ తత్వానికి అనుగుణంగా ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సును సాధించవచ్చని రక్షణ మంత్రి అన్నారు.
ఇండో పసిఫిక్ ఆర్మీ చీఫ్ ల 13వ సమావేశాన్ని భారత ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 30 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ….. ప్రపంచ దేశాలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. ఏ దేశం కూడా ఒంటరిగా ఈ సమస్యలను పరిష్కరించలేదనే విషయాన్ని దేశాలు గుర్తించాలన్నారు.
ఇండో-పసిఫిక్ అనేది సముద్ర నిర్మాణం కాదని అన్నారు. అది ఒక పూర్తి స్థాయి భౌగోళిక-వ్యూహాత్మక నిర్మాణం అని తెలిపారు. సరిహద్దు వివాదాలు, పైరసీతో సహా ఈ ప్రాంతం సంక్లిష్టమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నదని సింగ్ ఉద్ఘాటించారు. ‘సర్కిల్ ఆఫ్ కన్సర్న్’, ‘సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్’ అనే రెండు సర్కిల్స్ పై ఆధారపడిన అమెరికన్ రచయిత స్టీఫెన్ ఆర్ కోవే సైద్ధాంతిక నమూనా ద్వారా రాజ్ నాథ్ సింగ్ తన భావనను వివరించారు.
‘సర్కిల్ ఆఫ్ కన్సర్న్’లో వ్యాప్తి చెందుతున్న ఉమ్మడి ఆందోళనలను పరిష్కరించేందుకు దౌత్య మార్గం, అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ సమాజంతో పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సముద్ర కార్యకలాపాల కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, వివిధ దేశాల ‘సర్కిల్ ఆఫ్ కన్సర్న్’ ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల తలెత్తె సమస్యలను పరిష్కరించేందుకు చేసే అంతర్జాతీయ ఒప్పందాలకు 1982లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ఒక మంచి ఉదాహరణ అని వెల్లడించారు.