బీఆర్ఎస్ ప్రభుత్వమంటే లీకులు, లిక్కరేనని (Leaks and Liquor) బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రూప్-1 (Group-1) పరీక్ష సక్రమంగా నిర్వహించలేకపోవడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా కేసీఆర్ (KCR) కుటుంబ సభ్యులంతా మోడీపై ఎందుకు అక్కసు వెళ్లగక్కుతారో తెలియదని అన్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి అసహనం ఎక్కువైందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఏ రాష్ట్రానికి నష్టం జరగలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటులో చేసిన తప్పులను ఎత్తి చూపితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారో తెలియడం లేదన్నారు.
పాలమూరు ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని, నార్లపల్లి రిజర్వాయర్ వద్ద ఒక్క మోటార్ మాత్రమే ప్రారంభించి…ప్రజలకు రంగురంగుల సినిమాలు చూపిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పరీక్షల నుంచి ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా అవినీతిమయమేనని ఆరోపించారు.
బీసీ వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిని చేస్తారా? అని ఎమ్మెల్సీ కవిత ను ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసమే బీసీ బంధు ఇస్తున్నారని, దళిత బందుకు రూ. 10 లక్షలు ఇస్తే.. బీసీ బంధుకు లక్ష రూపాయలు మాత్రమేనా? అని నిలదీశారు. బీసీ సబ్ ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.